17, అక్టోబర్ 2020, శనివారం

మనసు మాట

నగలెన్ని ధరించినా నగుమోముకు సాటిరావు
గాజుపూల సోయగాలు కనులుదాటి మది చేరవు

మరులుగొలుపు మధురోహలు కనినంతనే యెద నిండును
అందమైన జ్ఞాపకాలు కలకాలము గుర్తుండును.. 

1, అక్టోబర్ 2020, గురువారం

సంచారి స్వగతం!

నేను లాగిన బండి నోగలు రబ్బరువి!

జోడెద్దుల కాడి సంసార బండిని
ఒంటెద్దు పోకడతో ఒంటరి ఎద్దునై
కష్టాల కడగండ్ల వరద దాటించగా
కాలంతో పోటీ పడి ప్రయత్నించిన..

నిలువులోతు నీటిలో నేర్పుగా నేనీదిన
నిండైన ధైర్యంతో మెండుగానే పోరాడిన
విధి విధించిన పద్మవ్యూహాన్ని చేధించిన
అయినా ఆర్థిక అంతరాలలో అభిమన్యుడనైన

నా ప్రయత్నం నేనైతే చేసిన
ఏమైనదోనని వెనుతిరిగి చూసిన..

అవును.. నే లాగిన బండి నోగలు
రబ్బరులా సాగినయ్..

మనం అనే నాగరికపు ఒడ్డుకు నేను చేరుకున్న
మేమే అని ఆటవికపు ఆ ఒడ్డున నా బండి నిలిచింది!

కారణం ఏమిటా అని కనులు నులిమి చూసిన
కలలు కల్లలే అని తెలిసి కనువిప్పు కలిగింది!
బ్రతుకంతా ధార పోసినా ఆ బండి
"భావ దారిద్ర్యము" దాటి నా ధరికి రాలే..

అందరమని మొదలైన ప్రస్థానం ఒంటరిగా మిగిలింది..
ఉనికి లేని చోట నిలిచి ఉపయోగం ఏముంది?!

అవును.. నే లాగిన బండి నోగలు
రబ్బరులా సాగినయ్..

ఇరుసు విరిగిపోయి
ఇనుము కరిగిపోయి
ఇంతైన లోకంలో ఇసుకలో కలిసిపోయే..

✍️సంచారి..