4, ఆగస్టు 2023, శుక్రవారం

అద్భుతం!

తన ప్రేమొక ప్రళయం, ముంచెత్తే జలం..
తన మనసేమో హిమం, నిర్మల ఆకాశం..
తన క్రోధం బడబాణాలం, దహించే అగ్నికణం..
తన రూపం సుందరం, ప్రాకృతిక భూగోళం..
తన ఉనికి అస్పష్టం, వాయువై విశ్వవ్యాపితం..

మొత్తంగా తానే ఒక అద్భుతం..
ఆవిష్కృతమైతే అది నా అదృష్టం!

✍️సంచారి..

12, జనవరి 2023, గురువారం

అలిశెట్టి..

అలిశెట్టి.. 

పీడిత జన పక్షపాతి
అణగారిన గొంతుకల జనశక్తి!

నిప్పుకనికలైన పచ్చి నిజాలను
నిష్టూరమే లేక నినదించిన కలం శక్తి!

అంధకార జీవితాలకు అక్షర రూపమై
అధికార మధంపై నిప్పులు చెరిగిన యువశక్తి!

అసలైన మనుషుల ఆచూకీ వెతికి
ఆకలిదప్పుల నిరసించిన నిజమైన దేశభక్తి!

✍️సంచారి..

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

మా ఊరు..

కన్నతల్లి వంటి మా ఊరు
తలచుకుంటే తన పేరు
చెమ్మగిల్లి కంట నీరు ఊరు..

పుట్టిపెరిగిన ఇల్లునిడిచి
ఆడి పాడిన జాడ మరచి
సోపతుల చెలిమి చేయి విడిచి
కడుపునింపిన పొలాలొదిలి..

పట్నవాసం దూర దేశం
కష్టనష్టాల సహవాసం
తల్లిదండ్రుల ప్రేమ దూరం
అక్కచెల్లెల అన్నదమ్ముల
ఆత్మీయుల ఆప్యాయతెరుగం

నేను తిరిగిన వాడల జాడలు
నీడలై నన్ను వెంటాడుతుంటే
నేను గడిపిన చెలక చేమలు
నేడు మనసు బీడై బీటలువారే

చిర్రగోనెలు గోలీలాటలు
రేస్ రేసులు అష్టాచెమ్మలు
అండ్లో దుర్గం ఇండ్లో దుర్గం
ఇచ్చిచ్చ పువ్వని ఆడిన ఆటలు.. 


✍️సంచారి..

చైతన్యం..

కదలిక "మెదల్లేక" కదల్లేని మెతక జనం..

కథలు వ్రాసే కలం తాకి మెరికలై పిడికిలెత్తే!
విప్లవాల గళం విని చిరుతలై ఉరకలెత్తే!
ఆలోచన అందుకుని సింహాలై శివాలెత్తే..✊

కదలిక "మెదల్లేక" కదల్లేని మెతక జనం..

28, నవంబర్ 2021, ఆదివారం

మౌనం-మాటలు..

మౌనం మాటలుగా మారినపుడు
గాయపడిన హృదయాలెన్నో..

మాటలు మంత్రాలుగా మారినపుడు
మానిపోయిన గాయాలెన్నో..

ఏ హృదయం మౌనం కోరునో,
ఏ గాయం మాటలనోర్చునో..
తెలియదు ఏనాడూ ఏ మనిషికీ,
ఎరుగడు ఏ కవి ఏనాటికీ..

✍️సంచారి..

27, అక్టోబర్ 2021, బుధవారం

మీను..

నీడలా వచ్చావు.. నిన్నలా వెళ్ళావు..
నే నడిచే దారుల్లో చెరగని గుర్తయ్యావు..

అదరాలు చిలికించే మధురాలు ఏమయ్యేనో!
మదినెల్లా మురిపించే వివరాలు ఎటువెళ్లేనో..!

నా అడుగుజాడల్లోన నీ ఊసులు కనిపించేను!
నువ్వెల్లే త్రోవల్లోన నా ఆశలు వికసించేనా?!

ఏ జన్మలో ఏ రుణముందో ఈజన్మలో కనిపించావు!
గత జన్మలో ఏ శాపమో మరి మరుజన్మకైనా కలిసొస్తావా?!

✍️సంచారి..

7, జూన్ 2021, సోమవారం

బాహ్యపు లోకం..

ఆ కొండల ఆవలనుందొక అందాల లోకం..

బండారు కిరణాల బంగారు ప్రపంచం,
భవిత చింతన లేని బాహ్యపు జీవితం,
బంధాల బంధనాలుండని భలే కొత్త రూపం..

ఆ కొండల ఆవలనుందొక అందాల లోకం..

✍️ సంచారి..

23, డిసెంబర్ 2020, బుధవారం

ఉందునా నీతో?!

నిన్నలు నీతో గడిచే నీలాకాశం కిందన,
నీలాల నీ కన్నుల బాసలు నే మరచిపోదునా?!

ఆనందం హరివిల్లుగా పూచే ఆకాశపుటంచున,
ఆశల విమానమెక్కి నీతో నూరేళ్లు విహరిద్దునా?!

ఊపిరి సలపని ఊహలు నీవై ఉన్నా నా పక్కన,
ఉబుసుపోని ముచ్చట్లతో ఉన్నంత కాలం బ్రతికేద్దునా?!

✍️సంచారి..

17, అక్టోబర్ 2020, శనివారం

మనసు మాట

నగలెన్ని ధరించినా నగుమోముకు సాటిరావు
గాజుపూల సోయగాలు కనులుదాటి మది చేరవు

మరులుగొలుపు మధురోహలు కనినంతనే యెద నిండును
అందమైన జ్ఞాపకాలు కలకాలము గుర్తుండును.. 

1, అక్టోబర్ 2020, గురువారం

సంచారి స్వగతం!

నేను లాగిన బండి నోగలు రబ్బరువి!

జోడెద్దుల కాడి సంసార బండిని
ఒంటెద్దు పోకడతో ఒంటరి ఎద్దునై
కష్టాల కడగండ్ల వరద దాటించగా
కాలంతో పోటీ పడి ప్రయత్నించిన..

నిలువులోతు నీటిలో నేర్పుగా నేనీదిన
నిండైన ధైర్యంతో మెండుగానే పోరాడిన
విధి విధించిన పద్మవ్యూహాన్ని చేధించిన
అయినా ఆర్థిక అంతరాలలో అభిమన్యుడనైన

నా ప్రయత్నం నేనైతే చేసిన
ఏమైనదోనని వెనుతిరిగి చూసిన..

అవును.. నే లాగిన బండి నోగలు
రబ్బరులా సాగినయ్..

మనం అనే నాగరికపు ఒడ్డుకు నేను చేరుకున్న
మేమే అని ఆటవికపు ఆ ఒడ్డున నా బండి నిలిచింది!

కారణం ఏమిటా అని కనులు నులిమి చూసిన
కలలు కల్లలే అని తెలిసి కనువిప్పు కలిగింది!
బ్రతుకంతా ధార పోసినా ఆ బండి
"భావ దారిద్ర్యము" దాటి నా ధరికి రాలే..

అందరమని మొదలైన ప్రస్థానం ఒంటరిగా మిగిలింది..
ఉనికి లేని చోట నిలిచి ఉపయోగం ఏముంది?!

అవును.. నే లాగిన బండి నోగలు
రబ్బరులా సాగినయ్..

ఇరుసు విరిగిపోయి
ఇనుము కరిగిపోయి
ఇంతైన లోకంలో ఇసుకలో కలిసిపోయే..

✍️సంచారి..

14, జూన్ 2020, ఆదివారం

కొయ్యన ఊగే కథలు..

వెండితెరల వెలుగులు
వేయి నోర్ల కితాబులు
కలిమి నింపిన సొబగులు
కడుపు నిండిన బ్రతుకులు..

అయినా...

కంటి నిండా కలలు
కనుల కొలనుల అలలు
వ్యథను వినని మనుషులు
మసకబారిన మనసులు..
కొయ్యన ఊగేను కథలు.. ఎన్నో.. ఇంకెన్నో...😔

On the sad demise of young 'STAR', Sushanth Singh Rajputh..


✍️సంచారి..

15, మే 2020, శుక్రవారం

'కూలీ'న బ్రతుకులు..

పగుల్లిచ్చిన వీరి పాదాలు
నలిగిపోతున్న నా దేశ చరితకు ఆనవాళ్లు

నెర్రెలిచ్చిన వీరి అడుగులు
నా దేశ ప్రగతిపై నిలిచిన నెత్తుటి మరకలు..

వందల మైళ్ళ వీరి ప్రయాణం
వేల ఏళ్ళ జీవన వికాసానికి వినాశనం..

నిరాశ నిస్పృహల వీరి జీవనం
నిష్క్రమిస్తున్న ఈ దేశ పరిపుష్టికి నిదర్శనం..

కూలిపోతున్న వీరి బ్రతుకులు
'కూలీ' పోతున్న నా దేశ అభివృద్ధికి తార్కాణాలు..


✍️సంచారి..

9, మే 2020, శనివారం

రైతు వ్యథ!

హోరున గాలి జోరుగా వాన
పంటల కుప్పలు కల్లం లోన..

మెరిసే మెరుపులు కురిసే చినుకులు
రైతన్న కంట రక్త కన్నీళ్లు..

హలాల పట్టి పొలాల దున్ని
కుప్పలు కుప్పలు పంటలు తెచ్చినా
పండిన పంటకు పైసలు రాలే
కల్లం మాత్రం వరదతో నిండే..

ఆరుగాలం పడిన కష్టం
అందరూ కలిసి చేసిన కష్టం
అయింది నేడు రావణ కాష్టం..

డొక్క చిక్కిన బక్క రైతు
బుక్క తినక బిక్కచచ్చే
చెడగొట్టు వాన రానే వచ్చే
కండ్లముందే పంటను ముంచే..


✍️సంచారి..

ప్రేమ-దుఃఖం

క్షణకాలం ముందు నువ్వొక ప్రేమదేవతవు
ఈ క్షణం నువ్వు నా శోకదేవతవు..

రెప్ప వేయకముందు నువ్వేనేనని వరమిచ్చావు
రెప్పపాటులోనే ఎవరికిఎవరని చెప్పి దుఃఖం మిగిల్చావు..

క్షణ భంగురమగు జీవితమిదని గుర్తు చేస్తున్నావు
క్షణక్షణం నా నుంచి నువ్వు దూరమవుతున్నావు..

చావు-పుట్టుక మధ్యనున్నదే బ్రతుకనుకున్నా
నీ తోడులేని బ్రతుకుకన్నా చావే నయమంటున్నా..


✍️సంచారి..

7, మే 2020, గురువారం

ఎడబాటు..

నీ చిరునవ్వే నా చిరుప్రాణమై..
నీ రూపే నా మదికి ముఖచిత్రమై..
సుమధుర జ్ఞాపకలెన్నో నను చుట్టుముడుతుంటే
మన ఈ ఎడబాటు నన్ను ఒంటరిని చేస్తుంది..

నీ నుంచి దూరంగా.. నువ్వే నా ప్రాణంగా..

ఎదురుచూస్తున్న ఒక మంచిరోజు కోసం..
మన ఇద్దరికి మరపురాని మనరోజు కోసం..

ఏనాటికైనా వచ్చేనా ఆరోజు?
ఎన్నటికీ నిను వీడని మనరోజు?!


✍️సంచారి..

ఎప్పుడో మరి ఏనాడో..

నీ చెక్కిలిని నా చేయి తాకేదెన్నడో
నీ పెదవిని నా పెదవి ముద్దాడేదెప్పుడో..

నా చూపులు నీ కన్నుల చేరేదెప్పుడో
నా మనిషిని నీమనిషి హత్తుకునేదెప్పుడో..

చూస్తూ ఉంటే నిన్నలా
పరిచినట్టుగా ఉంది పండు వెన్నెల..

కన్నుల్లో నీ రూపం
మనసులో నీ చిత్రం
గుండెల్లో నీ మర్మం
బ్రతుకులో ఒంటరితనం..


✍️సంచారి..

నువ్వు..

నా కవితకు నేపథ్యం నీవు
నా మాటకు వ్యాకరణం నీవు
నా పాటకు గొంతుక నీవు
నా బ్రతుకులో సంగీతం నీవు
నా మమతకు మగువవు నీవు
నా మనసుకు సాంత్వన నీవు..

నీవే నీవే నీవే..
సర్వం నీవే.. నా సర్వస్వం నీవే..

నేనూ నీవే,
నా ఆలోచన నీవే,
నా ఆహ్లాదం నీవే,
నా ఆశయం కూడా నీవే..

నా ఆశ్చర్యం నీవే
నా ఆనందం నీవే
నా అభిమానం నీవే
నా సంతోషం నీవే
నా స్వంతం కూడా నువ్వే..


✍️సంచారి..

16, జనవరి 2020, గురువారం

పల్లెతల్లి వరాలు

ఇదే కదా ఆనందం
కోట్లిచ్చినా కొనలేని సంబురం

ప్రకృతి మాత ఒడిలో
సేదతీరేను చిన్ని మనసులు
గంగమ్మ తల్లి జలసిరిలో
చెంగలిచ్చే చిట్టి మనుషులు

నిండు కుండలా చెరువులు కుంటలు
అలుగు దుంకిన మత్తడి సొగసులు
పొలం మడుల మట్టి పరిమళాలు
పచ్చదనపు పంటల తోరణాలు
నీలపు నింగి నిండైన సోయగాలు
పక్షులు ప్రాణుల సొంపైన సందడులు
హరితవనాల కొండలు గుట్టలు
ఆకట్టుకునే మయూర నాట్యాలు

పల్లెతల్లి మనందరికీ ఇచ్చింది ఇన్ని వరాలు
అయినా ఆ తల్లి ఒడిని వీడి తరళి వెళుతున్నాయి కొత్త తరాలు..


సంచారి..

26, అక్టోబర్ 2019, శనివారం

ప్రయాణం..

ఎండ తాపమునకు ఆవిరై ఆకాశమేగిన నీరు
మేఘ మధనం జరిగి భువికి దిగిన తీరు..
ఆటుపోటుల నడుమ అలసి సోలసిన బ్రతుకు
కర్మ ఫలములు తీర దైవ చెంతన చేరు..


సంచారి..

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

బంగారు కలల సింగారి!

కాఠిన్యపు కత్తితో కసితీరా పొడిచావు..
కారే మనసు నెత్తురును కాటుకగా దిద్దుకో.
జారే మది ప్రాణాలను జడకు పెనవేసుకో.
బంగారు కలల సింగారి నీవై చిరకాలం నిలిచిపో..

✍️సంచారి..



నువు చేసిన గాయం!

నింగిలో జాబిల్లివై నిదురపుచ్చుతావనుకున్నా..
నిదురించు వేళ కలవై కలవరపెడుతున్నావు.

చక్కని నెచ్చెలినీవై యెదలో సేద తీరుతావనుకున్నా..
మదిలో గుబులురేపి కనుమరుగైపోతున్నావు.

విహరించే వీచిక నీవై విశ్రమింపజేస్తావనుకున్నా..
ఊహాలు ఇక చాలంటూ నిష్క్రమిస్తానంటున్నావు.

వెన్నెల్లో వేగుచుక్కవై దారిచూపుతావనుకున్నా..
వేకువ వచ్చేస్తోందంటూ నిశీధిలో నీడవైపోతున్నావు.

మబ్బుల్లో నీజతగా తేలియాడుదామనుకున్నా..
కరిగే మేఘం నీవై కన్నీటి వర్షం కురిపిస్తున్నావు.


✍️సంచారి..

21, డిసెంబర్ 2018, శుక్రవారం

మనోవేదన

ఆకు రాలు కాలమిదని తెలియదు ఆశ రాలే వరకు
ఆవేదనతో ఎదురుచూస్తాను కొత్త చిగురు కొరకు

శిశిరం నీ బ్రతుకని చెప్పి మోడుగా మిగులుస్తావో
నీకై నేనున్నానంటూ వసంతం తీసుకొస్తావో

జన్మ జన్మలకూ తోడుంటావని జతగా చేరాను
చాలు ఇక నీజత అంటూ జ్ఞాపకంగా మారావు

ప్రాణం విడిచిన దేహం వలె కదలలేకున్నాను
గుండె పగిలిన గుర్తులేవి చెరపలేకున్నాను

కాలం పెట్టిన పరీక్ష మనోవేదనే మిగిల్చింది
దూరం పెరిగిన ప్రేమ మౌనమై నిలిచింది

మనిషి మారినా కానీ మనసు తా మారునా
తను వలచిన మనిషికి వేదనే మిగిలేనా



✍️సంచారి..

15, సెప్టెంబర్ 2018, శనివారం

మనం..

కమ్మని కలలు బంధాలు
కనులు తెరిస్తే కనిపించు కపటాలు..

తీయనైనవి అనుబంధాలు
తీపితరిగిన నాడు అవి అబద్ధాలు..

స్వచ్ఛమైన మంచువంటి ప్రేమలు..
మనసుల కాలుష్యంతో కరిగే ప్రవాహాలు..

అద్భుతమగు మనుషుల ఆలోచనలు
మానవ సంబంధాలకు బంధనాలు..

మానవ మస్తిష్కపు పరిమళాలు
సాటి మనుషులకు పంచు దుర్గంధాలు..


✍️సంచారి..

17, ఆగస్టు 2018, శుక్రవారం

అక్షర అశ్రునివాళి..

కరిగిపోయే మేఘమా కన్నీరు కార్చకు
జారిపోవు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టు..
నెలబాలుడొస్తున్నాడు నీతో తేలిపోయేందుకు
పరుగాపిన పసిమనస్కుడు నీతో సేదతీరుతాడు..

అస్తమించే కిరణమా ఆగు కాసేపు
నిన్ను మించిన వెలుగు కొలువుదీరెను చూడు..
మినుకు మినుకుల సితారా చిన్నబోనేరకు
తళుకు బెళుకుల తార నీ చెంతచేరెను చూడు..

చక్కనైన చతురమా ఆ ధాటి ఏదని అడగకు
తన పలుకులతో ఆదేవుని మురిపించ సాగేను..
సాగిపోయే రాగమా సాహితీకుసుమమేదని వెతుకకు
తన కలం నాకందించి తను కలాం చెంతకు చేరెను..

ఓ మహాత్మా.. నీకిదే నా అక్షర అశ్రునివాళి..💐😔


✍️సంచారి..


16, ఆగస్టు 2018, గురువారం

ఓ మహాత్మా..

ఓ మహాత్మా.. అస్తమించింది నీవు కాదు..

విలువలు గల రాజకీయం,
విజ్ఞత గల నాయకత్వం,
బాధ్యత గల ఒక తరం..

ఇవే కదా అస్తమించింది!
నీవు మాయెదలో శాశ్వతమై కొలువుందువుగాక..

ఓ నిరంతర జ్ఞాన నేత్రమా..
నిర్దేశించు మా నడవడికను తుదికంతా,
విశ్రమించు ప్రశాంతుడవై ఆ దేవదేవుడి చెంత,
ఓదార్చు ఆ దేవలోకాన్ని నీ వాక్-ప్రవాహంచేత..

ఓ స్వయం ప్రకాశిత నక్షత్రమా..
నిశీధి నిండిన ఈ లోకంలో నీ క్రాంతిని నింపు,
చీకటి నిండిన నీ వారసులకు వెలుగును పంచు..

విశ్వమానవుడవై విరాజిల్లు..
లోక పూజితుడవై వర్ధిల్లు..

సర్గస్థ్య ప్రాప్తిరస్తు..🙁💐


✍️సంచారి..

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

విశ్వగురు నాదేశం..

మంది తోడు బలం.. ధనం తోటి రాజ్యం..
ఆ రెండింటితోడు రాజకీయం..
అందుకే.. మరి అందుకే
విశ్వగురు నా దేశం.. సదా చూసే వినాశనం..

ఖర్మ ఖర్మ అని తలతిప్పుకోనా?
ఖండ ఖండాలుగా నరికి పారేయ్యనా??

గొంతుచించుకు అరుచు గొంతులేమయ్యే?
గొడవ నాకెందుకని గోడనుకరిచే..

గొప్ప గొప్పలని చరుచు జబ్బలేమాయే?
పసిబిడ్డల చేరబట్టే కామాంధులాయే..

దేవ దేవుల కొలుచు భక్తులేమాయే?
దేవుళ్లను పోల్చక మూఢంధులాయే..

ఘనతకెక్కిన చరిత ఏమూల పోయే?
ఘనమైన మాటలు కిక్కిరిసిపోయే..

వినుతికెక్కిన ధర్మమేదారి చూచే?
భగ భగల సెగల నిప్పుల్లు కక్కే..


✍️సంచారి..

29, నవంబర్ 2016, మంగళవారం

అలన్ కుర్దీ (In remembrance of Alan Kurdi, a Syrian boy of Kurdish ethnic background who drowned in the Mediterranean Sea on 2 September 2015)

సామ్రాజ్యవాదం నాటిన విషపు మొక్క 
మత మౌఢ్యమై ఎదిగి,  ఛాందసమై విస్తరిస్తూ
మతం పేర మనుషుల ప్రాణాలను బలిగొంటే.. 

ప్రాణాలను చేతబట్టి పుట్టినూరు వదిలిపెట్టి 
కనిపించని తీరంలో ఊహించిన భవిష్యత్తుకై
కంపించే ధరణి వదిలి కల్లోల కడలి చేరే.. 

స్వార్ధపు ఈలోకానికి కన్నీటి సుడులు మిగిల్చి
మూడేళ్ళ ప్రాయంలో నూరేళ్లు నిండగా 
శాశ్వతంగా నిదురించే సంద్రమమ్మ ఒడిలో..

చీకటి ఈప్రపంచపు నిస్తేజాన్ని దులిపి 
వెలుగు రేఖలు చూపిన నిరాశ్రయ సిరియా బాలుడు
అభాగ్యుల పాలిట ఉదయించిన సూరీడు.. 


✍️సంచారి..

 

శైశవం..

దివినేలిన తారలు - భువికి వచ్చిన దివ్వెలు 
బోసినోటి నవ్వులు - మదిని దోచే మనసులు 
తప్పటడుగుల నడకలు - చెమ్మగిల్లిన కన్నులు 
ముద్దు ముద్దు మాటలు - ముంచెత్తే ప్రశ్నలు 

ఎంత గొప్ప వరమీ శైశవం..
ఎన్నటికీ మరపురాని జ్ఞాపకం.. 


✍️సంచారి..

23, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మా మిన్నమ్మ

అమ్మలగన్న అమ్మ
మా ఇంట కొలువుదీర 
మిన్నమ్మగా వచ్చేనంటా 

జన్మజన్మాల మా ఆర్తి తీరగా 
మా నట్టింట నవ్వులపువ్వులు పూయగా 
సంతోషాల సంబరాలు తెచ్చేనంటా..


✍️సంచారి..

8, ఆగస్టు 2016, సోమవారం

మా చిన్ని కృష్ణుడు!

జయాదిత్య

వెన్నముద్దలు ఆరగించిన చిన్ని కృష్ణుడీతడు
అమ్మ ప్రేమను ఆదరించిన ఆది భగవానుడీతడు

పూతన చనుబాలుతాగి మోక్షమొసగిన గోప బాలుడీతడు
వేణు గాన లహరిలో ఆలమందనలరించిన మురళీమోహనుడీతడు 

రేపల్లె లోగిల్లలో తిరుగాడిన యశోదానందనుడీతడు
గొల్లవాడల సల్లముంతలు కొల్లగొట్టిన చోర బాలుడీతడు 

కాళీయుని పీచమణిచిన తాండవకృష్ణుడీతడు
గోవర్ధనగిరినెత్తిన గోకుల గిరిధారుడీతడు

గొల్లభామల కన్నె మనసులు దోచుకున్న కొంటె బాలుడీతడు 
భువిపై యెద యెదలో మధుర సుధను నింపిన శ్రీ కృష్ణుడీతడు..


✍️సంచారి..

22, ఏప్రిల్ 2014, మంగళవారం

నీకిక సెలవు..

నిన్నటి నీ నవ్వులకై నీడై నీ వెంట నడిచా
నీ చూపుల వేడి సోకి నిదురే లేకుండా గడిపా

నిదురలేని రాత్రినడుగు నీకై బ్రతికింది ఎవరో..
నీ నీడను తరచి చూడు నీతో నడిచింది ఎవరో...

నా గుండెలో నీ చిత్రం చిత్రించిన వారెవరు?
మరపురాని జ్ఞాపకాన్ని మదిలో ముద్రించినదెవరు?

నీకైనా తెలుసునా నేనున్నది నీతోనే అనీ
నిన్న నేడు రేపు కూడా నువ్వే నా ప్రాణమని 

జ్ఞాపకాల బరువు నన్ను నిలువున ముంచేస్తుంది
గడిచిన నిన్నటి కాలం నీడై వెంటాడుతోంది

చింతించను నేను నా గత కాలపు స్మృతులకు!
ఊహించని మజిలీ ఇది రేపటి భవిష్యత్తునకు!!


✍️సంచారి..

16, ఏప్రిల్ 2014, బుధవారం

అబద్ధం...

నీ దానను నేనన్నావు
నడి రేతిరి కలవైనావు

వడి వడిగా నిను చేరేలోగా 
నెరజాణవై జారుకున్నావు

నాకై పుట్టిన అబద్దం నీవు 
అందుకే.. ఎప్పటికీ నిజం కాలేవు!


✍️సంచారి..

నువ్వే...

చిరునవ్వుల నీ రూపం... ఆ జాబిలమ్మకు ప్రతిరూపం 
ఈ దొరసాని దరహాసం.. నా కంటికి అపురూపం

నీతో గడిపే ప్రతీ క్షణం ఎన్నెన్నో అద్భుతాల వీక్షణం 
నీ వెంట నడిచే ప్రతి నిమిషం కొంగొత్త జ్ఞాపకాలకు ఉషోదయం 

నా మదిలో మెదిలే నీ తలపులు 
అవి నా కలత నిద్రకు కారణాలు

నీ జ్ఞాపకాల సవ్వడిలో రెప్ప వాల్చలేను...
నీకే చెందిన కలలో కనులు కూడా తెరవలేను!


✍️సంచారి..

నా నువ్వు

రెప్ప వాల్చు వేళ కలత నిద్రవు నీవు 
కనులు తెరచు వేళ కమ్మని కలవైనావు
కనులు మూసి నీ తలపులు ఆపలేను!
కనులు తెరచి నా కలను మరవలేను!!

నిన్న మొన్నటి వరకు స్వర్గమే తెలుసు 
నిన్ను కలిసింది మొదలు నరకమే నాకు.. 
వదిలి ఉండలేను... దరిచేరనూ లేను! 
ముద్దు ముచ్చటకైనా నోచుకోనే లేను!!

ప్రొద్దు పొడిచిన మొదలు ప్రొద్దస్తమానం 
గుబులు పుట్టెను గుండె గడియకోమారు 
చెలియ క్షేమము కోరి దిగులు చెందిన మనసు 
తన స్వరము వినగానే కుదుటపడును

మాటలాడు వేళ మంత్రమేదో వేసి
మనసు దోచుకున్న మగువ నీవు 
అలసిసొలసిన నాకు ఆదరవైనావు 
సేద తీర చెలిమి చేసినావు


✍️సంచారి..

2, ఏప్రిల్ 2014, బుధవారం

నన్ను-నేను

వెండి మబ్బుల వెనక... మాటున దాగి  చూసే చంద్రమా....
దారి తెలియక ఆగిపోతిమి.. తోవ చూపవా మిత్రమా..?

పడతి  కన్నుల నీరు గాంచక
తెప్పమాటున దాగి పోతివి... 

నిన్ను నమ్మిన నీదు చెలియకు వెన్నెలేది నేస్తమా??

చెలిమి శాపం.. బ్రతుకు భారం... 
తెలుసుకొనక వదిలిపోతివి!

నిన్ను వలచిన కాంత కన్నుల
కలలు ఏవి? కథలు మావి.. 

కథలు మావి... వ్యథలు మావి... 

వెండి మబ్బుల వెనక.. మాటున దాగి చూసే చంద్రమా.... 
దారి తెలియక ఆగిపోతిమి.. తోవ చూపవా మిత్రమా...


✍️సంచారి..

10, జూన్ 2013, సోమవారం

ఎటు వైపు మన పయనం?

Add caption
గతమొక వైభవం,
ప్రస్తుతం నిరాడంబరం,
భవిష్యత్తు శూన్యం!


తరగిపోతున్న మానవ సంబంధాలు,
వెల్లివిరుస్తున్న ఆర్ధిక బంధాలు,
వెరసి అవి మానవ మనుగడకే ప్రతిబంధాలు!


విజ్ఞానాన్ని విడిచిన విద్యావంతులు,
విచక్షణను మరచిన ఉపాధ్యాయులు,
భాద్యతలు ఎరుగని తల్లిదండ్రులు,
మొత్తంగా భవిష్యత్తులే లేని చిన్నారులు!


ఇదీ ఈనాటి సమాజ స్వరూపం...
భారత పతనానికి భవిష్యత్ దర్పణం!



✍️సంచారి..

27, ఫిబ్రవరి 2013, బుధవారం

నువ్వు-నేను

అచ్చెరువొందించే చిత్తరువు నీవైతే,
ఆ చిత్రాన్ని వివరించే చేవ్రాలు నేనవుతా!


ఆనందపు హరివిల్లు నీవైతే,
ఆ అందాన్ని పూయించే చినుకును నేనవుతా!!


అసాధ్యాలను అందుకునే లక్ష్యం నీదైతే,
ఆ విజయాలకు ఆలంబన నేనవుతా!!!


నన్ను లాలించే నా తల్లివి నీవైతే,
నిన్ను నడిపించే నీ
తండ్రిని నేనవుతా!!!!


✍️సంచారి..

22, ఫిబ్రవరి 2012, బుధవారం

ఓ మనిషి...

ఓడిన మనిషిని నేనని జాలిగా చూడకు!
ఓటమి ఒక పాఠం అని నేర్చుకునే వరకు!!

దమ్మున్నది నాకేనని రొమ్ము చూపి నడువకు!
చివరి క్షణం వరకు నువ్వు వెన్ను చూపి వెళ్ళకు!!

నమ్ముకున్న వాళ్ళని నడి సంద్రంలో వదలకు!
బరువు మోయలేక భవ బంధాలను తెంచకు!!

నేనున్నది నీతోనేనని వాగ్దానం చెయ్యకు!
మృత్యువే మన తోడుందనే వాస్తవాన్ని మరవకు!!

ఓడిన మనిషిని నేనని జాలిగా చూడకు!
ఓటమి ఒక పాఠం అని నేర్చుకునే వరకు!!


✍️సంచారి..

20, ఫిబ్రవరి 2012, సోమవారం

నేడు-నేను

నీ జ్ఞాపకాలే నాకు ఊపిరి అవగా,
నీ పిలుపు కోసమే పరితపిస్తున్నాను ఎన్నో జన్మలుగా,
ఆ క్షణం కోసమే వేచి చూస్తున్నాను యుగయుగాలుగా.....

నీతో గడిపిన క్షణాలే అపురూపంగా,
మదిలో మెదిలే నీ భావాలే కవితా ప్రవాహాలవగా,
నేను నీకోసమే బ్రతుకుతున్నాను మన ప్రేమే సాక్షిగా...

నా చుట్టూ ఎంత మంది ఉన్నా... నాకున్న ఆత్మ బంధువు నువ్వేనని తెలుసుకోలేవా నేస్తమా!

✍️సంచారి..

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

నేల తారక...


నీలి నింగిలో పండు వెన్నెల
నేల తారకై వచ్చెను నీలా...

చెంత చేరగా నిండు జాబిలి
కల అయిపోవుగా  చెలియా...

మదిలో రూపం మరువక మునుపే
మహిలో నిజమే తెలిసెనుగా...

నీవు నాదానివే కావు.. అయినా నీ గుర్తులే పోవు!
ఇది నిజమని తెలిసు.. కాని కల అయితేనే మేలు!!


✍️సంచారి..

అనిష్

ఆ నరేంద్రనాథుడి అంశగా జనించితివేమో!

నిర్మలమైన నీ మోము,
నిష్కల్మషమైన నీ నవ్వు,
నిరుపమానమైన నీ తేజస్సు!!

నీతి చెడ్డ మన జాతిని కాపాడగా,
నిద్రాణమై ఉన్న యువ శక్తిని మేల్కొల్పగా,
విజ్ఞాన సంపన్నుడవగు వివేకానందుడవేనేమో!!!



✍️సంచారి..

అనిష్

చిన్ని నవ్వుల ఓ చిట్టి కన్నయ్యా
తప్పటడుగులు నీకు నేర్పిందేవరో!
 

అడుగేసే ముందే ఆలోచించు
అటు పైన వెనుదిరిగి చూడకు!!
 

అన్ని పంచి ఇచ్చిన అమ్మానాన్న
అండగా నీవెంట నిలబడే ఉంటారు!!



✍️సంచారి..

అనిష్

నింగిలోని పాలపుంత,
నేల చేరేనేమో మీ చెంత!

చుక్కలన్నీ దిక్కులవగా,
చందమామే మన అనిష్ అయ్యాడో ఏమో!!

మినుకు మినుకు కనురెప్పల నడుమ,
ప్రభవించేను వెలుగుల రేఖలు...
అవి మీ బ్రతుకున నింపెను వెండి వెన్నెలలు...



✍️సంచారి..

29, డిసెంబర్ 2010, బుధవారం

నువ్వు...

కలల్లో విహరిస్తావు
కవ్వించి కదిలిస్తావు...

కనులు తెరచి నిను దర్శించు వేళ
కన్నీటి సుడులు మిగులుస్తావు..

వలచే వధువు నీవని తలువ
వగచే వలపౌతావు..

బ్రతుకే నీదని చెప్ప
 భవబంధాలను తెంచేస్తావు..

నా నువ్వని మురువ నన్ను ఏకాకిగా మిగులుస్తావు

యెదలోని తీపి స్మృతులను చెరిపి ఎగిరెళ్లిపోతావు

చెలీ.... ఎందుకు నాకీ గుండె కోత.. చావనీయక! బ్రతకనీయక!!



✍️సంచారి..

6, నవంబర్ 2010, శనివారం

ప్రియమైన నీకు...

ఉషోదయాన నన్ను తాకే నులివెచ్చని భానుడి కిరణం నీ స్పర్శే అనుకుంటా,
వసంతాన మదిని దోచు మధుర గాన సుధా లహరి నీదేనని వింటూ ఉంటా,
సంధ్య వేల వినిపించు కిలకిలారావాలు నీ నవ్వులను తలపిస్తుంటే,
నాకు వినిపించే ప్రతి రాగం నీ నవ్వేనని.. నేను వినగలిగే ప్రతి శబ్దం నీ పేరేనని..,
నాలో రేగే ప్రతి అలజడికి కారణం నీవేనని.. నీకెలా చెప్పేది నేస్తమా....
నాకు తెలుసు నువ్వు నాదానివి కాదు అని.... కానీ.. మనసు మాట వినదు కదా!!!


✍️సంచారి..

10, ఆగస్టు 2010, మంగళవారం

నేస్తం..

నీ కన్నుల నిండుగా ఉక్రోషము నిండగా,
నీ మాటల మాటున ఆక్రందన దాగెనా,
నీ సుందర మోము పై చిరునవ్వులు మాయమై,
నిను చూడగా నేస్తమా నా కన్నులు తడిసేగా..

✍️సంచారి..

11, జనవరి 2010, సోమవారం

నైరాశ్యం...

ఎక్కడికో ఈ పయనం..
ఎటువైపో నా గమ్యం...

ఎడారి దారిలోన ఏకాకిగా వెళుతున్న,
మృత్యు గుహ లోనికి ఓటమితో వెళుతున్నా...
అవమానాల అంపశయ్య పై ఆదమరచి సేద తీరుతున్నా..

అలసిన మనసుతో ఆశగా చూస్తున్నా...
ఆదుకునే ఆ అదృశ్య హస్తం ఎవరిదోనని..!

ఆర్తిగా వింటున్నా...
ఆ మృదు మధురవాణి ఏ కవిదోనని..!!

మై మరచి చూస్తున్నా...
ఆ .. అపురూప దృశ్యం ఎవరోనని..!!!

✍️సంచారి..