15, మే 2020, శుక్రవారం

'కూలీ'న బ్రతుకులు..

పగుల్లిచ్చిన వీరి పాదాలు
నలిగిపోతున్న నా దేశ చరితకు ఆనవాళ్లు

నెర్రెలిచ్చిన వీరి అడుగులు
నా దేశ ప్రగతిపై నిలిచిన నెత్తుటి మరకలు..

వందల మైళ్ళ వీరి ప్రయాణం
వేల ఏళ్ళ జీవన వికాసానికి వినాశనం..

నిరాశ నిస్పృహల వీరి జీవనం
నిష్క్రమిస్తున్న ఈ దేశ పరిపుష్టికి నిదర్శనం..

కూలిపోతున్న వీరి బ్రతుకులు
'కూలీ' పోతున్న నా దేశ అభివృద్ధికి తార్కాణాలు..


✍️సంచారి..

9, మే 2020, శనివారం

రైతు వ్యథ!

హోరున గాలి జోరుగా వాన
పంటల కుప్పలు కల్లం లోన..

మెరిసే మెరుపులు కురిసే చినుకులు
రైతన్న కంట రక్త కన్నీళ్లు..

హలాల పట్టి పొలాల దున్ని
కుప్పలు కుప్పలు పంటలు తెచ్చినా
పండిన పంటకు పైసలు రాలే
కల్లం మాత్రం వరదతో నిండే..

ఆరుగాలం పడిన కష్టం
అందరూ కలిసి చేసిన కష్టం
అయింది నేడు రావణ కాష్టం..

డొక్క చిక్కిన బక్క రైతు
బుక్క తినక బిక్కచచ్చే
చెడగొట్టు వాన రానే వచ్చే
కండ్లముందే పంటను ముంచే..


✍️సంచారి..

ప్రేమ-దుఃఖం

క్షణకాలం ముందు నువ్వొక ప్రేమదేవతవు
ఈ క్షణం నువ్వు నా శోకదేవతవు..

రెప్ప వేయకముందు నువ్వేనేనని వరమిచ్చావు
రెప్పపాటులోనే ఎవరికిఎవరని చెప్పి దుఃఖం మిగిల్చావు..

క్షణ భంగురమగు జీవితమిదని గుర్తు చేస్తున్నావు
క్షణక్షణం నా నుంచి నువ్వు దూరమవుతున్నావు..

చావు-పుట్టుక మధ్యనున్నదే బ్రతుకనుకున్నా
నీ తోడులేని బ్రతుకుకన్నా చావే నయమంటున్నా..


✍️సంచారి..

7, మే 2020, గురువారం

ఎడబాటు..

నీ చిరునవ్వే నా చిరుప్రాణమై..
నీ రూపే నా మదికి ముఖచిత్రమై..
సుమధుర జ్ఞాపకలెన్నో నను చుట్టుముడుతుంటే
మన ఈ ఎడబాటు నన్ను ఒంటరిని చేస్తుంది..

నీ నుంచి దూరంగా.. నువ్వే నా ప్రాణంగా..

ఎదురుచూస్తున్న ఒక మంచిరోజు కోసం..
మన ఇద్దరికి మరపురాని మనరోజు కోసం..

ఏనాటికైనా వచ్చేనా ఆరోజు?
ఎన్నటికీ నిను వీడని మనరోజు?!


✍️సంచారి..

ఎప్పుడో మరి ఏనాడో..

నీ చెక్కిలిని నా చేయి తాకేదెన్నడో
నీ పెదవిని నా పెదవి ముద్దాడేదెప్పుడో..

నా చూపులు నీ కన్నుల చేరేదెప్పుడో
నా మనిషిని నీమనిషి హత్తుకునేదెప్పుడో..

చూస్తూ ఉంటే నిన్నలా
పరిచినట్టుగా ఉంది పండు వెన్నెల..

కన్నుల్లో నీ రూపం
మనసులో నీ చిత్రం
గుండెల్లో నీ మర్మం
బ్రతుకులో ఒంటరితనం..


✍️సంచారి..

నువ్వు..

నా కవితకు నేపథ్యం నీవు
నా మాటకు వ్యాకరణం నీవు
నా పాటకు గొంతుక నీవు
నా బ్రతుకులో సంగీతం నీవు
నా మమతకు మగువవు నీవు
నా మనసుకు సాంత్వన నీవు..

నీవే నీవే నీవే..
సర్వం నీవే.. నా సర్వస్వం నీవే..

నేనూ నీవే,
నా ఆలోచన నీవే,
నా ఆహ్లాదం నీవే,
నా ఆశయం కూడా నీవే..

నా ఆశ్చర్యం నీవే
నా ఆనందం నీవే
నా అభిమానం నీవే
నా సంతోషం నీవే
నా స్వంతం కూడా నువ్వే..


✍️సంచారి..